ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

 ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లండి : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • తెలంగాణ సాంస్కృతిక సారథి అవగాహన సదస్సులో మంత్రి జూప‌‌ల్లి
  • కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ

హైదరాబాద్/ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక సారథి కళాకారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క‌‌ళాకారుల‌‌కు మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు గుర్తింపు కార్డుల‌‌ను అంద‌‌జేశారు.

అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. ద‌‌శ‌‌ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది క‌‌ళాకారుల‌‌కు ఐడెంటిటీ కార్డుల‌‌ను అంద‌‌జేస్తామ‌‌ని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సాంస్కృతిక సారథి కళాకారులకు కూడా ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా చూస్తామ‌‌ని భ‌‌రోసానిచ్చారు. అర్హులైన కళాకారులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ ప‌‌రిశీల‌‌న‌‌లో ఉంద‌‌ని మంత్రి చెప్పారు.  

బ్యాండ్ కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి

డప్పు, బ్యాండ్ వాయిద్య కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు అని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాండ్‌‌, వాయిద్య కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన వారికి పెన్షన్ కల్పించే అంశాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వీఎస్టీ చౌరస్తా నుంచి బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో మంత్రి జూపల్లి, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో వాయిద్య కళాకారుల పాత్ర విశిష్టమని పేర్కొన్నారు.